Latest News

ఖైరతాబాద్‌ మహాగణపతి రూపమిదే

ఖైరతాబాద్‌ మహాగణపతి రూపమిదే

హైదరాబాద్‌: ప్రపంచ గుర్తింపు పొందిన ఖైరతాబాద్‌ గణేశుడు ఈ ఏడాది శ్రీ చండీకుమార మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది ప్రతిష్ఠించబోయే 57 అడుగుల భారీ గణేశ్‌ విగ్రహానికి సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేతుల మీదుగా గణేశ్‌ ఉత్సవ కమిటీ శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ విగ్రహానికి కుడివైపు మహాశివుడు, ఎడమ వైపు మహిషాసురమర్థిని రూపంలో విగ్రహాలు కనులవిందు చేయనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహాగణపతి ఆశీస్సులతో సమాజంలో అన్నివర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. అందరి సహకారంతో ఈ సారి ఖైరతాబాద్‌ మహాగణపతి వేడుకలు అట్టహాసంగా, అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామని ఉత్సవకమిటీ ప్రతినిధులు వెల్లడించారు. గతేడాది 58 అడుగుల విగ్రహం దర్శనమివ్వగా.. ఈ ఏడాది ఓ అడుగు తగ్గించనున్నట్టు తెలిపారు.
ఏటా ఏదో ఒక ప్రత్యేకతతో ఖైరతాబాద్‌ గణేశుడి ఉత్సవ కమిటీ విగ్రహాన్ని తయారు చేస్తుంటుంది. గతేడాది శివనాగేంద్రుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన గణేశుడు ఈ ఏడాది చండీకుమార మహాగణపతిగాకన్పించి భక్తజనానికి దీవెనలందించనున్నారు.

Posted by 108TV TELUGU in Latest News, 0 comments
గద్దర్ పార్టీ.. వ్యూహం ఏంటి..? టార్గెట్ ఎవరు?

గద్దర్ పార్టీ.. వ్యూహం ఏంటి..? టార్గెట్ ఎవరు?

మీ పాటనై వస్తున్నా అంటూ.. జనం మధ్యకు పోయేందుకు ప్రజా గాయకుడు గద్దర్ రెడీ అయ్యారు. బడుగుల బాగు కోసం తెలంగాణలో ఇంకో రాజకీయ పార్టీ అవసరం ఉందని ఆయన స్వయంగా చెప్పారు. కాల్పుల్లో తూటా దెబ్బలకు గాయపడిన సందర్భానికి 20 ఏళ్లు నిండిన సందర్భంగా.. ఆయన తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడించారు. ప్రజల్లో అధిక భాగం ఉన్న జనానికి రాజ్యాధికారం రావాలంటే.. ఆ జనం బతుకులు బాగు పడాలంటే.. పార్టీ అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యపరిచేందుకు తాను జనాల్లోకి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు.

అంతా బానే ఉంది. ఇంతకీ గద్దర్ టార్గెట్ ఎవరు? ఇన్నాళ్లూ ప్రజా ఉద్యమాలు చేసి.. నక్సల్బరీ ఉద్యమంలో పాల్గొని.. ఇప్పటికీ జనంలోనే తిరుగుతూ.. జనం కోసం బతుకుతున్న 70 ఏళ్ల పెద్దాయన గద్దర్ ఏం సాధించాలని పార్టీ పెట్టబోతున్నారు? భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొని పోతా.. అని ఎందుకు చెప్పారు? ఈ ప్రశ్నలే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురే లేకుండా పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రతిపక్షానికి చోటే కనుమరుగైన నేటి తరం రాజకీయాల్లో గద్దర్.. ఎందుకు.. ఎలా.. రాజకీయం చేయబోతున్నాడన్నది.. జనంలోనూ ఆలోచన రేకెత్తిస్తోంది.

కాంగ్రెస్ పూర్తిగా కనిపించకుండా పోయింది. కమ్యూనిస్టులు జాడ కూడా కనుమరుగైపోయింది. తెలుగుదేశం పార్టీ ఉనికిని ఎప్పుడో పోగొట్టుకుంది. బీజేపీ ఒక్క హైదరాబాద్ కే పరిమితం అయ్యింది. స్పష్టంగా చెప్పాలంటే.. టీఆర్ఎస్ రాజకీయ ఎత్తులు సక్సెస్ అవుతున్న పరిస్థితుల్లో.. ప్రతిపక్ష స్థానం శూన్యంగా మారింది. అదే తనకు అనుకూలంగా మలుచుకునేందుకు గద్దర్ రెడీ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటి అధికార పక్షంమీద.. ఎప్పుడో ఒకప్పుడు వ్యతిరేకత రాక మానదు. అప్పుడు ప్రజలు మరో అవకాశం చూసుకోక మానరు. అదే.. గద్దర్ ను రాజకీయ పార్టీవైపు అడుగులు వేసేందుకు దారి చూపినట్టు కనిపిస్తోంది.

నిజంగా.. గద్దర్ అనుకున్నపని చేసి.. తెలంగాణ రాజకీయ వేదికపై కొత్త పార్టీ అంటూ పెడితే.. కచ్చితంగా అది పెద్ద సంచలనమే అవుతుంది. టీఆర్ఎస్ పునాదులపై కూడా అది ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రజా నాయకుడిగా.. ఉద్యమకారుడిగా.. గద్దర్ కు ప్రజల్లో ఉన్న పేరే.. ఆయన కొత్త పార్టీకి ఊపిరి కానుంది. గద్దర్ పాటే.. కొత్త రాజకీయ పార్టీకి బాటలు వేయనుంది. చూద్దాం. గద్దర్ ఎలా.. ఎవర్ని.. ఎంతలా.. ఢీ కొడతారో!

Posted by 108TV TELUGU in Latest News, 0 comments